కుక్క కాటుకు చెప్పు దెబ్బ


కుక్క కాటుకు చెప్పు దెబ్బ
సాకేతపురం అనే ఊరిలో చంద్రయ్య అనే కిరాణా వ్యాపారి ఉండేవాడు. అతడు చాల మంచివాడు. తన వ్యాపారాన్ని నీతినిజాయితిగా నడిపేవాడు.న్యాయమైన ధరలకే సరుకులు అమ్ముతాడని చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరు సంపాదించాడు. ప్రతిరోజు చంద్రయ్య వద్దకు దూరదూర ప్రాంతాల నుండి ఎందరో చిల్లర వర్తకులు వచ్చి సరుకు కొనుగోలు చేసి మారుబేరానికి అమ్ముకునేవారు. అలా వచ్చే వారిలో రంగయ్య ఒకడు.
రంగయ్య చాల రోజుల నుండి చంద్రయ్య దగ్గర సరుకులు కొంటు౦డట౦తో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అయితే రంగయ్యకు ఈమధ్య కాలంలో డబ్బుపైన విపరీతమైన అత్యాశ కలిగింది ఎలాగైనా సరే త్వరగా డబ్బు సంపాదించాలి,ఆస్తులు కూడబెట్టాలి అన్న కోరిక బలంగా పెరిగిపోయింది. దానితో ఒక నకిలీ నోట్లు తయారు చేసే ముఠాతో పరిచయం పెంచుకున్నాడు.
 చంద్రయ్య దగ్గర సరుకులు కొన్నప్పుడు ఆసరుకుల ఖరీదు చెల్లించేటప్పుడు తన దగ్గర ఉన్న దొంగ నోట్లను మంచి నోట్లతో కలిపి ఇచ్చేవాడు. మొదట్లో ఈవిషయం చంద్రయ్య గ్రహించలేకపోయాడు.తర్వాత,తర్వాత స్నేహం ముసుగులో ఈమోసం రంగయ్యే చేస్తున్నాడని గ్రహించాడు.
కాని ఈవిషయాన్ని రంగయ్య తో  నేరుగా అడగడం వలన నిజం ఒప్పుకోడని తెలుసు కానీ ఇలా అడగడం వలన తనకు ఇవ్వవలసిన బాకీ ఇవ్వకపోగా ఇంకొకరిని ఇలాగే మోసం చేస్తాడు కదా అని ఆలోచించాడు పోనీ పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే ఎంతైనా స్నేహితుడు కదా ఉన్న పరువు కాస్తా పోతుంది అని ఆప్రయత్నం కూడా విరమించాడు.
ఇంతలో చంద్రయ్య పెద్ద కొడుకు పట్టణ౦లో తన చదువు పూర్తిచేసుకొని తిరిగి తండ్రికి సాయంగా ఉండటానికి రోజూ దుకాణా౦లో ఉండసాగాడు. ఒకసారి భోజనం చేస్తుండగా చంద్రయ్య తన కొడుకు రామంతో రంగయ్య విషయమంతా చెప్పాడు. తండ్రి మాటలు విన్న రామం "నాన్నగారు ఈసారి రంగయ్య సరుకులు కొనడానికి వస్తే ఆబేరం నాకు అప్పగించండి అని అన్నాడు రామం.
మరుసటి రోజు రంగయ్య సరుకులు కొనడం కోసం చంద్రయ్య కొట్టుకి వచ్చాడు. అతను చెప్పిన జాబితా రాసుకున్న రామం " మీరొక గంటలో పని చూసుకొని రండి ఇంతలో సరుకులన్నీ సర్ది సంచుల్లో పెట్టి ఉంచుతాను" అని చెప్పి రంగయ్యను పంపించాడు.
    రంగయ్య చెప్పిన జాబితాలో ఉన్న సరుకునంతా తనే పోట్లాలలో కట్టి సంచులలో సర్ది ఉంచాడు రామం. రంగయ్య రాగానే వాటన్నిటిని అప్పగించాడు. అతను వెళ్ళిపోయాక చంద్రయ్య కొడుకుతో "నువ్వేదో రంగయ్యకు బాగా బుద్ధి చేబుతావనుకుంటే నాకంటే బ్రహ్మా౦డంగా పొట్లాలు కట్టి పంపించావు అన్నాడు. "మీరు చాల పొరపడ్డారు నాన్న! నేను రంగయ్యకు చాల బాగా బుద్ధి చెప్పాను "కుక్క కాటుకి చెప్పు దెబ్బ"లాగా ఇది బాగా తగిలితీరుతు౦ది రంగయ్యకు అన్నాడు తండ్రితో రామం.
   కొడుకు మాటలు విన్న చంద్రయ్య "ఎప్పుడు బుద్ధి చెప్పావు? నాకు అంతా ఆశ్చ్యర్యంగా ఉందే" అన్నాడు. దానికి జవాబిస్తూ రామం  "నాన్నగారు నేను రంగయ్యకు ఇచ్చింది అతను చెప్పిన జాబితాలోని సరుకులని కాదు అతని చీటీలో జీడిపప్పు,కందిపప్పు,పంచదార,యాలకులు, ఖర్జూరం అని ఖరీదైన వస్తువులు ఉన్నాయి కదా నేను వాటి స్థానంలో వాటిని పోలి ఉన్న తక్కువ ధరకులభి౦చే సరుకులను పొట్లం కట్టాను. జీడిపప్పు బదులుగా శనగగుళ్ళు, పంచాదారకి బదులుగా గోధుమనూక, ఖర్జూరం బదులుగా చింతపండు ఇలా అన్ని వేరే సరుకులు కట్టాను.అవే అతనికి అప్పజెప్పాను, కానీ అతను డబ్బు చెల్లించింది ఖరీదైన వస్తువులకు, నేను ఇచ్చింది తక్కువ ధరవి అతను ఇంటికి వెళ్లి పొట్లాలు విప్పిన మరుక్షణం విషయం తెలుసుకొని కంగుతింటాడు, కానీ ఈవిషయ౦ గురించి మనల్ని అడగలేడు. "తేలు కుట్టిన దొంగ"లాగా ఉండిపోతాడు. అతను వ్యాపారే కదా! తానిచ్చిన దొంగనోట్లకు మనం కూడా దొంగ సరుకులతో సమాధానం చెప్పామని తప్పక గ్రహిస్తాడు. అతను మనమిచ్చిన సరుకుల గురించి మనల్ని అడిగితే మనం అతనిచ్చిన చెల్లని నోట్ల గురించి అడుగుతామని భయపడతాడు. ఈ దెబ్బతో అతను మెల్లిమెల్లిగా మారతాడు అన్నాడు రామం.
రంగయ్య చేసిన మోసానికి తగిన విధంగా బుద్ధి చెప్పిన తన కొడుకు తెలివితేటలకు అభినందించాడు చంద్రయ్య.

No comments:

Powered by Blogger.