సప్తర్షుల శాపం


సప్తర్షుల శాపం
చంద్రవంశానికి చెందిన రాజు నహుషుడు. మహాపరాక్రమవంతుడు, ధర్మనిరతి కలిగిన రాజు. ప్రజలను కన్న తండ్రిగా పరిపాలిస్తూ మంచి చక్రవర్తిగా పేరు గడించాడు. ఇలా ఉండగా ఇంద్రుడు కొంత పాపం చేసినందువల్ల దాని పరిహారం కోసం మానససరోవరంలో ఒక తామర తూడులో ఉండి తపస్సులో మునిగిపోయాడు. దీనితో ఇంద్ర పదవికి ఖాళి ఏర్పడింది. ఇంద్రుడు తిరిగి వచ్చే వరకు ఆస్థానాన్ని పూరించగల సమర్థుడయిన వ్యక్తి కోసం దేవతలందరు అన్వేషించసాగారు. చివరకి వారందరు కూడా నహుషుడు అయితేనే ఈ పదవికి సరిపోతాడని అభిప్రాయానికి వచ్చారు. నారద మహర్షిని నహుషుని వద్దకు పంపించి ఇంద్ర పదవిని స్వీకరించవలసిందిగా ఆహ్వానం పంపారు. నహుషుడు అందుకు ఆనందంగా అంగీకరించాడు. తాత్కాలికంగా ఇంద్ర పదవిని స్వీకరించాడు. ధర్మబద్ధంగా పరిపాలన చేయసాగాడు. కాలంతో పాటే క్రమెనా నహుషుడికి అధికార మద౦ తలకెక్కింది. అహంకారంతో విచక్షణాజ్ఞానాన్ని కోల్పోయాడు. ఇంతలో ఒక రోజున దేవేంద్రుడి భార్య శచీదేవి ఉద్యానవనంలో విహరిస్తూ నహుషుడికి కనపడింది. ఆమె అందచందాలకు నహుషుడు ముగ్దుడయ్యాడు. ఆమెను ఎలాగైనా తన రాణిగా చేసుకోవాలని అనుకొన్నాడు.
    ఇంద్ర పదవిని చేపట్టిన తనకు ఇంద్రుని భార్య శచీదేవి పట్టపురాణిగా విచ్చేసి, తనతో పాటు సింహాసనం అధిష్టి౦చాలని శాసనం చేసాడు. నహుషుడి అధర్మ ప్రవర్తనకు దేవతలందరు కోపించారు. కానీ ఏం చేయగలరు.... తామే తీసుకొచ్చి నహుషుడుకి మహేంద్ర పదవిని కట్టబెట్టాం కదా కాబట్టి, కాదని ఖండించడానికి వీలులేదు మరేం చేయాలో తెలియక దేవతలందరు కలవరపడ్డారు. మహా పతివ్రత అయిన శచీదేవికి ఇదంతా తెలిసింది. ఆమె దేవతల గురువైన బృహస్పతి వద్దకు వెళ్లి ఈ ఆపదను తప్పించమని మొరపెట్టుకుంది. అయన ఒక ఉపాయం చెప్పాడు. అదేమంటే, నహుషుడుని ఎదురించగల పరాక్రమవంతుడు ఎవరు లేరు కాబట్టి, అతన్ని ఎలాగైనా సరే మునుల శాపానికి గురయ్యేలా చేయమని శచీదేవికి చెప్పాడు బృహస్పతి. అయన మాటలకు ధైర్యం తెచ్చుకొని శచీదేవి ఒక తెలివైన ఉపాయం ఆలోచించింది. అదేమిటంటే, తాను ఇంద్రాణి కాబట్టి, తన భర్త సామాన్యుడిగా తన వద్దకు రాకుడదని, సప్తర్షులు మోసే పల్లకిలో కూర్చొని తన వద్దకు రావాలని కబురు పంపింది నహుషుడుకి.
     అధికార మదంతో విర్రవీగుతున్న నహుషుడుకి మంచిచెడు ఆలోచించలేదు. " ఓస్! అదెంత పని" అంటూ తన పల్లకిని మోసేటందుకు రావలసిందిగా సప్తర్షులకు వర్తమానం పంపాడు. నహుషుడి వర్తమానం విని సప్తర్షులు కోపోద్రిక్తులయ్యారు. అయినా, తమాయి౦చుకున్నారు. నహుషుడు పల్లకిలో ఆసీనుడు కాగా, సప్తర్షులు ఆ పల్లకిని మోయసాగారు. ఆ ఋషుల౦దరిలోకి పొట్టివాడు,బలహీనుడు అయిన అగస్త్యుడికి పల్లకిని మోయడం తలకు మించిన పని అయ్యింది. మిగిలిన వారితో సమానంగా అడుగులు వేయలేకపోయాడు. దాంతో పల్లకి కుదుపులకు గురయ్యి౦ది. పల్లకి వేగం కూడా తగ్గింది. ఇదంతా తెలుసుకున్న నహుషుడు అగస్త్యుడిని కొరడాతో అదిలిస్తూ, "సర్ప సర్ప" అన్నాడు. "సర్ప" అంటే త్వరగా నడవమని అర్థం. నహుషుడి ప్రవర్తనకు కోపించిన అగస్త్యుడు " అధికార మదంతో ఉచితానుచితాలు, ధర్మాధర్మాలు మరచిపోయిన నీవు సర్పంగా(పాము) మారి, భూలోకంలో పడిఉండు" అని శపించాడు.
     అగస్త్యుడు శపించిన తర్వాత తన తప్పు తెలిసింది నహుషుడికి. కనులకు కమ్మిన పొరలు కరిగిపోయాయి. వెంటనే అగస్త్యుడి కాళ్ళ మీద పడి తనను క్షమించి, శాపవిమోచనం చెప్పవలసిందిగా ప్రార్థించాడు. అప్పుడు అగస్త్యుడు నహుషుడి ప్రార్థనకు సంతసించి శాప విమోచన మార్గం చెప్పాడు "రాజా! నీవు ఒక కొలను వద్దగల బిలంలో ఉంటూ, అక్కడికి నీళ్ళు తాగడానికి వచ్చిన వారిని నిర్బ౦ధిస్తూ, వారిని కొన్ని ప్రశ్నలు అడుగు వారిలో ఎవరైతే నీ ప్రశ్నలకు సరైన సమాధానం చెపుతారో, అప్పుడే నీకు శాపవిమోచనం కలుగుతుంది" అంటూ శాపా౦తం చెప్పాడు.
తక్షణం నహుషుడు మహాసర్పమై, భూలోకంలోని ఒక కొలనులోని ఒడ్డున గల బిలంలో ఉండసాగాడు. కొన్ని వేల ఏళ్ళ తర్వాత ఆ కొలను వద్దకి వచ్చిన భీముడిని తన భారి శరీరంతో చుట్టి వేసి, ఎటు కదలకుండా బంధించి వేశాడు సర్పరూపంలో ఉన్న నహుషుడు. భీముడిని వెతుక్కుంటూ వచ్చిన ధర్మరాజు, నహుషుడు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పడంతో నహుషుడుకి శాపవిముక్తి కలిగింది.
    పూర్వ జన్మ పుణ్యం వల్లనో, ఈ జన్మలో చేసిన గొప్ప పనుల వల్లనో గొప్ప పదవులు వరించవచ్చు. దాన్ని తమ గొప్పతంగా భావించి అహంకారంతో ఎవరిని లెక్కజేయకుండా ప్రవర్తించేవారికి పతనం తప్పదని ఈ కథ చెబుతుంది.        

No comments:

Powered by Blogger.