శల్య సారథ్యం


శల్య సారథ్యం
శల్యుడు మద్రదేశాన్ని పరిపాలించేవాడు. పాండవులకు మేనమామ. పాండురాజు భార్య మాద్రికి స్వయాన అన్న. యుద్ధం చేస్తున్న పాండవులకి సహాయపడాలని వారి దగ్గరకు బయల్దేరాడు. ఇది తెలుసుకున్న దుర్యోధనుడు కుట్రతో దారిలోనే ఆయనకు ఘనస్వాగతం చేయించాడు. శల్యుడు అది ధర్మరాజు చేస్తున్న సత్కార్యం అనుకొని ఆనందంగా స్వీకరించాడు. యుద్ధభూమికి వెళ్ళాక కానీ అసలు విషయం తెలియలేదు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయింది. శల్యుడు ధర్మరాజు దగ్గరకు వెళ్లి "నాయన మీరు నాకు అత్యంత ఆప్తులు మీ పక్షాన నిలబడి యుద్ధం చేయాలని బయలుదేరాను. అయితే దుర్యోధనుడు దుర్బుద్ధితో నాకు ఘనంగా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశాడు. అవి మీరే చేసి ఉంటారనే భ్రమతో నేను వాటన్నింటిని స్వీకరించాను. కనుక దానికి ప్రతిఫలంగా దుర్మార్గుడు అయినప్పటికీ ధుర్యోధనుడి పక్షాన యుద్ధం చేయవలసి వస్తో౦ది. కానీ నీవు రాజనీతిజ్ఞుడివి, ధర్మపరుడవి కాబట్టి ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడే ఉపాయాన్ని అలోచించు" అన్నాడు. ధర్మరాజు కృష్ణుడి వద్దకు వెళ్లి విషయమంత చెప్పి "ఇప్పుడు ఏమి చేయమంటారు" అని అడిగాడు. దానికి కృష్ణుడు " ధుర్యోధనుడి సైన్యంలో కర్ణుడు మహా పరాక్రమవంతుడు. భీష్మ,ద్రోణులు పరాక్రమవంతులు అయినప్పటికీ కూడా వారు మనస్పూర్తిగా పాండవుల విజయం కోరుకుంటున్నవారే కానీ కర్ణుడు అలా కాదు. ధుర్యోధనుడికి ప్రాణ మిత్రుడు. కనుక పొరపాటున కూడా దుర్యోధనుడు ఓడిపోవాలని కర్ణుడు కోరుకోడు. పరశురాముడి శిష్యుడు, మహా వీరుడైన కర్ణుడిని ఓడించడం అసంభవం. అయితే శల్యుడు మాత్రమే ఈ అసంభవాన్ని సంభవం చేయగల సమర్ధుడు. కాబట్టి మీరు శల్యుడిని కర్ణుడికి రథసారథ్యం వహించమని కోరండి" అని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు శల్యుడి వద్దకు వెళ్లి "మామ కర్ణుడు కౌరవసేనకు సైన్యాధిపతి అయినప్పుడు మీరు అతని రథసారథిగా ఉంటూ, అతని మనోబలాన్ని నిరంతరం తగ్గిస్తూ ఉండాలి. ఇందుకోసం మీరు కర్ణుడి వ్యక్తిగత జీవితంలోని, ధుర్యోధనుడి సైన్యంలోని లోటుపాట్లు వినిపిస్తూ,కర్ణుడిని, కర్ణుడి సైన్యాన్ని నిరంతరం నిందిస్తూ, అతని మనోబలాన్ని కృ౦గదీయండి" అని కోరాడు. ధర్మరాజు కోరిన కోరికకు తన అంగీకారం తెలిపాడు శల్యుడు. పాండవులు కోరినట్లే సరైన సమయానికి కర్ణుడి రథానికి సారథ్యం వహిస్తూ, కర్ణుడిని అతని సైన్యాన్ని నిందిస్తూ, అంచల౦చలుగా కర్ణుడి మనోబలాన్ని దెబ్బతీశాడు శల్యుడు. దాంతో కర్ణుడు యుద్ధంలో ఏకాగ్రతను కోల్పోయి మనసు వికలమై సరిగ్గా యుద్ధం చేయలేకపోయాడు. అలా కౌరవుల పరాజయానికి పరోక్ష కారకుడయ్యాడు కర్ణుడు. అందుకే ఎవరైనా మన పక్షంలోనే ఉంటూ, మన మనోబలాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతు౦టే అలాంటి వారిని శల్య సారథ్యం చేస్తున్నాడు అని అంటాం.

No comments:

Powered by Blogger.