తగిన పరిష్కారం


తగిన పరిష్కారం
సీతాపురం అనే ఊరిలో సోమయ్యశెట్టి అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. అతడు ఊరిలోని ప్రజలందరికీ అప్పులు ఇచ్చేవాడు. వారికి చదువు రాకపోవడం చేత వడ్డీ మీద వడ్డీ వేసి వారి చేత బలవంతంగా డబ్బులు వసూలు చేసేవాడు. కట్టలేని వారి ఆస్తులు, పొలాలు కూడా బలవంతంగా స్వాధీనం చేసుకొనేవాడు. ఎవరికీ కూడా పెద్దగా చదవు లేనందువలన ఆలెక్కలు తెలియక సోమయ్యశెట్టి మోసాన్ని బయటపెట్టలేకపోయారు. అనతికాలంలోనే చిన్న ఇంట్లో నివసించే సోమయ్యశెట్టి నాలుగంతస్తుల మెడ కట్టాడు. ఇదంతా గమనిస్తున్న వీరయ్య అనే యువకుడు గ్రామాధికారి దగ్గరకి వెళ్లి సోమయ్యశెట్టి చేస్తున్న మోసాల గురించి ఫిర్యాదు చేశాడు. కానీ గ్రామాధికారి ఈ విషయాన్ని గురించి అంతగా పట్టించుకోలేదు. దీనికి కారణం గ్రామాధికారికి సోమయ్యశెట్టి నుండి ప్రతినెల కొంతమొత్తం అందుతూ ఉంది అందువల్లనే గ్రామాధికారి స్పందించలేదు ఇది గ్రహించిన వీరయ్య గ్రామాధికారి వల్ల తమకు ఎలాంటి న్యాయం జరగదని గ్రహించి  ఒకరోజు నేరుగా దేశాన్ని పరిపాలిస్తున్న విజయసింహ మహారాజు వద్దకు వెళ్ళాడు. అక్కడ రాజుగారితో సోమయ్యశెట్టి మోసాలు,ధనదాహం గురించి చెప్పి, గ్రామాధికారి అసమర్ధత గురించి కూడా మహారాజుకు సవినయంగా మనవి చేశాడు వీరయ్య. అంతా విన్న మహారాజు ఇలా అన్నాడు "వీరయ్య మీగ్రామంలో ఒక పాఠశాల పెట్టిస్తాము. దానికి వ్యవహార జ్ఞానం,నీతినిజాయితి ఉన్న ఉపాధ్యాయులను నియమిస్తాము. అ౦తే కాకుండా సాయంత్రంపూట అక్కడ ఉన్న గ్రామస్తులందరికీ చదువు చెప్పేలా చూస్తాము. దీనిని మీ ప్రజలందరు సద్వినియోగం చేసుకోగలరు" అన్నాడు మహారాజు. ఇదంతా విన్న వీరయ్య "ఇదేమిటి ప్రభూ! నేను సోమయ్యశెట్టి చేస్తున్న మోసాలకు తగిన శిక్ష వేస్తారనుకుంటే మీరు పాఠశాల కట్టిస్తామని చెబుతున్నారు" అని ఆశ్చర్యంగా అడిగాడు వీరయ్య. వీరయ్య మాటలకు జవాబు చెబుతూ మహారాజు "వీరయ్యా! ఆదోషిని శిక్షించడంతో ఈమోసాలు ఆగిపోవు. సోమయ్యశెట్టిని శిక్షించినగాని తర్వాత మరొక వడ్డీ వ్యాపారి తయారవుతారుగదా! అందుచేత ముందుగా గ్రామప్రజలు చదువు నేర్చుకోవాలి. చదువు వలన మంచిచెడు గ్రహించే తెలివితేటలు,పెరుగుతాయి. జ్ఞానం వస్తుంది. అది లేకపోవడంచేతనే సోమయ్యశెట్టి మోసాలకు గ్రామస్తులు బలయ్యారు. సోమయ్యశెట్టిని వెంటనే శిక్షిస్తాను. నువ్వింకా నిశ్చింతగా వెళ్ళు అన్నాడు మహారాజు. రాజుగారి మాటలకు ఎంతో సంతృప్తి చెందాడు వీరయ్య తమ సమస్యకు తగిన పరిష్కారం చూపిన మహారాజుకు సవినయంగా నమస్కరించి సంతృప్తిగా గ్రామం చేరుకొని గ్రామప్రజలందరికీ రాజుగారి పరిష్కారం గురించి చెప్పి, రాజుగారి దూరదృష్టికి ప్రజలందరు రాజుగారిని ఎంతో కీర్తించారు.
నీతి: మనం ఒకరి చేతిలో మోసపోకుండా ఉండాలంటే తప్పకుండా చదువుకొని తీరాలి చదువు వలన మంచిచెడు గ్రహించే తెలివితేటలు పెరుగుతాయి అన్నదే ఈకథలోని నీతి.

No comments:

Powered by Blogger.