అత్యాశ
అత్యాశ
రామాపురం అనే ఉరిలో రంగయ్య,కమలమ్మ అనే దంపతులు ఉండేవారు. వారిద్దరు ఎంతో కష్టపడి
తమకున్న కొద్దిపాటి పొలంలోనే కూరగాయలు పండించేవారు. వాటిని అమ్మి వచ్చిన
సొమ్ముతోనే ఉన్నంతలో ఆనందంగా జీవించేవారు ఒకరోజు మొక్కలు నాటడానికి పొలం పని
చేస్తుండగా వారు తవ్విన గుంతలో నుండి ఒక ఇత్తడి చెంబు కనిపించింది. దాన్ని బయటకు
తీసి దానికి ఉన్న మూత తియగానే ఆశ్చ్యర్యకరంగా కొన్ని మాటలు వినిపించాయి "నేనొక
గంధర్వుడిని శాపవశాత్తు ఈ చెంబులో బందీ అయినాను. ఇన్నాళ్ళకు మీవలన శాపవిమోచనం
కలిగింది. ఇకనుండి మీకు అంతా మంచే జరుగుతుంది" అనే మాటలు వినిపించాయి. వారు
ఆమాటలకు ఆశ్చ్యర్యపోతూ ఆచెంబును జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్లి దేవుని దగ్గర ఉంచారు.
ఆరోజు కూరగాయలు అమ్మగా వచ్చిన డబ్బుని ఆచెంబులో దాచిపెట్టి౦ది కమలమ్మ. మరునాడు సరుకులు కొందామని చెంబు తెరచి చూస్తే
తాము ఉంచిన ఆడబ్బు మొత్తం రెట్టింపు అయ్యింది. భార్యాభర్తలిద్దరు అది చూసి చాల
సంతోషించారు. అలా వారు రోజు కష్టపడి సంపాదించిన సొమ్మును ఆ చెంబులో పెడితే
రెట్టింపు కాసాగింది. దాంతో ఆడబ్బు వెచ్చించి కొంత పొలం కొన్నారు. మరికొంత
కాలానికి ఒక్క పెద్ద ఇల్లు కూడా కట్టుకున్నారు. కమలమ్మ బొలెడన్ని నగలు
కొనుక్కున్నది. వారి ఇల్లంతా సిరిసంపదలతో నిండిపోయింది. ఒకరోజు రంగయ్య ఇంటికి
తమ్ముడి వరుస అయ్యే సోమయ్య వచ్చాడు. వారి సిరిసంపదలు చూసి చాల అసూయా పడ్డాడు.
మెల్లగా వారిని మాటలలో పెట్టి చెంబు గురించి దాని మహిమ గురించి విషయం
తెలుసుకున్నాడు. ఆమాటలు విన్నాక సోమయ్యకు ఆరాత్రంతా అసూయా,ఆరాటాలతో నిద్ర
పట్టలేదు. ఎలాగైన సరే వీరికి ఇంత సంపదనిస్తున్న చెంబుని ఎలాగైనా సరే కాజేయాలని నిర్ణయించుకున్నాడు.
మరుసటి రోజు రాత్రి అందరు గాఢ నిద్రలో ఉండగా అదును చూసి చెంబును దొంగిలించాడు. తన ఊరికి
వెళ్లి తనకు రోజు వసూలు అయ్యే వడ్డీ డబ్బును చెంబులో వేసి ఉంచాడు. మర్నాడు ఎంతో
ఆశగా చెంబు మూత తీసి ఆత్రంగా చూశాడు. తాను ఉంచిన వడ్డీడబ్బులు రెట్టింపు అవలేదు
సరికదా సగమైంది. దాంతో కంగుతిన్నాడు వడ్డీ వ్యాపారి సోమయ్య. సరే మరుసటి రోజు
చూద్దామని ఆరోజు వసూలు అయిన వడ్డీ డబ్బంతా చెంబులో వేసి ఉంచాడు. మరుసటి రోజు చెంబు
తెరచి చూడగా మళ్ళీ సగమే కనిపించింది. ఇదేదో విచిత్రంగా ఉందే అనుకొని చెంబులో ఏమి
వేయకుండా ఖాళీగా ఉంచాడు. ప్రొద్దున లేవగానే చెంబు ఖాళీగానే ఉంది కానీ ఇనుప
పెట్టెలో ఉంచిన వడ్డీ డబ్బు సగమైంది, ఇదంతా చూసి కంగుతిన్న సోమయ్యకు కొన్ని మాటలు
వినిపించాయి "ఇతరుల కష్టాన్ని దోచుకుంటే నష్టపోక తప్పదు" ఈ మాటలు విన్న
సోమయ్యకు బాగా బుద్దొచ్చింది. తాను చేసిన మోసానికి తనకున్న అత్యాశకు తగిన శిక్ష
పడింది అనుకుంటూ తిరిగి చెంబును రంగయ్య,కమలమ్మ దంపతులకు తిరిగి ఇచ్చివేసి తాను
చేసిన తప్పుకు క్షమాపణలు అడిగాడు.
No comments: