వజ్రాల ఉంగరం


వజ్రాల ఉంగరం
సింహపురి నగరంలో న్యాయాధికారి ఎంతో సమయస్పూర్తితో ఎంత కఠినమైన సమస్యకయిన సరైన తీర్పునిచ్చి గొప్ప న్యాయాధికారిగా పేరు పొందాడు. ఒకసారి ఆయన దగ్గరకు రామయ్య, భీమయ్య అనే ఇద్దరు వచ్చారు. వారిని తీసుకువచ్చిన బాటసారులు ఒక వజ్రాల ఉంగరం న్యాయాధికారికి చూపిస్తూ "అయ్యా! వీరిద్దరు ఈ ఉంగరం కోసం ఘర్షణ పడుతుండగా మీవద్దకు తీసుకొనివచ్చాం" అని అన్నారు. ఇంతలో రామయ్య న్యాయాధికారితో ఇలా అన్నాడు "అయ్యా! ఆ ఉంగరం నాదే, భీమయ్యది కాదు", అన్నాడు. అప్పుడు భీమయ్య న్యాయాధికారితో ఇలా అన్నాడు "అయ్యా! నేను దారిలో నడుస్తుండగా నాచేతి ఉంగరం చూసి మా ఊరిలో దొంగలు ఎక్కువ, మీ ఉంగరం జాగ్రత్త అని అన్నాడు రామయ్య, ఆ మాటలు విని నేను నా ఉంగరాన్ని తీసి సంచిలో భద్రపరచుకోవాలనుకున్నాను. ఇంతలో ఒకసారి చూసి ఇస్తాను అని చెప్పి తీసుకొని ఇప్పుడు ఈ ఉంగరం నాదే అంటున్నాడు రామయ్య" అని చెప్పాడు భీమయ్య. అందుకు రామయ్య "అయ్యా! భీమయ్య చెప్పినదంతా నిజం కాదు, ఆ ఉంగరం నాదే" అని అన్నాడు.
   ఇద్దరి వాదనలు విన్న న్యాయాధికారి వజ్రాల ఉంగరాన్ని చేతిలోకి పరిశీలించి ఇలా అన్నాడు "ఈ ఉంగరం మీ ఇద్దరిది కాదు. ఇది రాజుగారి ఉంగరం. ఈ రాజుగారి ఉంగరాన్ని మీలో ఎవరు దొంగిలించారో చెప్పండి. చెప్పకపోతే మీ ఇద్దరికి ఉరిశిక్ష కాయం" అన్నాడు కోపంగా న్యాయాధికారి.
    రామయ్య వెంటనే "అయ్యా! కొన్ని రోజుల క్రిందట తోటపని చేస్తుంటే ఈ ఉంగరం మా పెరట్లో దొరికింది. ఏదైనా పక్షిగాని, దొంగగాని జారవిడచి ఉండాలి, అంతేకాని నేనేమి దొంగతనం చేయలేదు" అన్నాడు. అప్పుడు భీమయ్య ఇలా అన్నాడు "అయ్యా! క్షమించాలి, ఇది రాజుగారి ఉంగరం కావడానికి ఎలాంటి అవకాశం లేదు. ఇది మా తాత ముత్తాతల నుండి నాకు వారసత్వంగా వచ్చిన ఉంగరం దీనికి సాక్ష్యం మాఇంట్లో గోడకి వేలాడదీసిన మా తాతగారి చిత్రపటంలో ఆయన వేలికి ఈ ఉంగరం స్పష్టంగా కనిపిస్తుంది. కావాలంటే నేను ఆ చిత్రపటాన్ని తీసుకవస్తాను అని చెప్పాడు భీమయ్య. రాజుగారి ఉంగరం అనే సరికి భయంతో రామయ్య పెరట్లో దొరికిందని అబద్ధం చెప్పాడని న్యాయాధికారి గ్రహించాడు. భీమయ్యను మోసం చేసి వజ్రాల ఉంగరం కాజేయాలని చూసిన రామయ్యకు పెద్ద మొత్తంలో జరిమానా విధించి, వజ్రాల ఉంగరాన్ని భీమయ్యకు ఇప్పించాడు న్యాయాధికారి.
నీతి: అబద్ధం చెప్పినవాళ్ళు ఏదో ఒక సందర్భంలో దొరికిపోతారు అన్నదే ఈ కథలోని నీతి.       

No comments:

Powered by Blogger.