వ్యత్యాసం


వ్యత్యాసం
ఒకసారి బీర్బలుకి బాగా సుస్తి చేసింది. కొద్దిరోజులపాటు సభకి వెళ్ళలేదు. ఒకరోజు ఒక యువకుడు సభకు వచ్చి "మహారాజా, ఆస్థానా విదూషకుడి కొలువు ఇస్తే బీర్బల్ కంటే చక్కగా పనిచేస్తాను. నాకు ఈ అవకాశం ఇవ్వండి" అని అడిగాడు. "నీ తెలివితేటలను తెలుసుకోవడానికి ఒక పరిక్ష పెడతాను. అందులో నువ్వు గెలిస్తే నిన్ను విదూషకుడిగా నియమిస్తాను. లేకపోతే వంద కొరడా దెబ్బలు తినాల్సి ఉంటుంది, అందుకు నువ్వు సిద్ధమేనా?" అన్నాడు అక్బర్ చక్రవర్తి. "సిద్దమే ప్రభూ" అన్నాడు ఆ యువకుడు. "గుర్రాలశాల నుంచి శబ్దం వినిపిస్తుంది వెళ్లి అదేంటో చూసిరా" అన్నాడు చక్రవర్తి. వెంటనే వెళ్లి వచ్చిన యువకుడు "అది గుర్రాలశాల నుండి కాదు ప్రభూ, మేకల మంద నుండి వచ్చింది. అక్కడ ఒక మేకకు పిల్లలు పుట్టాయి" అన్నాడు ఆ యువకుడు. "ఎన్ని పిల్లలు పుట్టాయి?" అని అడిగాడు అక్బర్. ఆ యువకుడు మళ్ళీ వెళ్లి చూసివచ్చి "నాలుగు పిల్లలు ప్రభూ" అన్నాడు. "ఏ రంగులో ఉన్నాయి?" అని ప్రశ్నించాడు అక్బర్. యువకుడు మళ్ళీ వెళ్లి వచ్చి "రెండు తెల్లవి, రెండు నల్లవి ప్రభూ" అన్నాడు. అందులో "ఎన్ని మగవి, ఎన్ని ఆడవి" అని అడిగాడు అక్బర్. ఆ యువకుడు మళ్ళీ వెళ్లి చూసి వచ్చి "రెండు మగవి, రెండు ఆడవి" అన్నాడు. "మగవి ఏ రంగు, ఆడవి ఏ రంగు" అని ప్రశ్నించాడు అక్బర్. యువకుడు మళ్ళీ వెళ్లి చూసి వచ్చి "మగవి నల్లగా ఉన్నాయి, ఆడవి తెల్లగా ఉన్నాయి" అని చెప్పాడు.

        సరిగ్గా అదే సమయంలో బీర్బల్ సభకు వచ్చాడు. అతడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న అక్బర్ "గుర్రపుశాల నుంచి ఇంతకుముందే ఏదో ఒక శబ్దం వినిపించింది అదేమిటో చూడు" అన్నాడు. వెళ్లి చూసి వచ్చిన బీర్బల్ "జహాపనా, ఆ శబ్దం గుర్రాలశాల నుంచి కాదు, ఆ పక్కనే ఉన్న మేకల మంద నుండి వచ్చింది. అక్కడి మేకకు నాలుగు పిల్లలు పుట్టాయి. అందులో రెండు మగవి, రెండు ఆడవి. మగవి నల్లగా ఉన్నాయి, ఆడవి తెల్లగా ఉన్నాయి". అని వివరంగా చెప్పాడు. అప్పుడు అక్బర్ ఆ యువకుడి వైపు తిరిగి...."బీర్బల్ నిశిత దృష్టిని గమనించావు కదా. నేను ఒక విషయం కనుక్కొని రమ్మంటే అతడు మొత్తం సమాచారం సేకరించి వచ్చాడు. అతడికి, నీకూ ఎంత వ్యత్యాసం ఉందో కళ్ళారా చూశావు కదా. వంద కొరడాదెబ్బలకు సిద్దమేనా" అన్నాడు. ఆ యువకుడు వెంటనే బీర్బల్ కాళ్ళ మీద పడి జరిగినదంతా చెప్పి తనను రక్షించమని వేడుకున్నాడు. బీర్బల్ సర్ది చెప్పడంతో అక్బర్ మహారాజు ఆ యువకుడిని క్షమించి వదిలి వేశాడు.
నీతి: గొప్పవారి గురించి అన్ని వివరాలు తెలియనిదే తొందరపడి మాట్లాడరాదు. అన్నదే ఈ కథలోని నీతి.  

No comments:

Powered by Blogger.