తోడ్పాటు
తోడ్పాటు
కొండాపురం అనే ఊరిలో ఇద్దరు స్నేహితులు
ఉండేవారు. వారి పేర్లు శ్యాము,కృష్ణ వారిద్దరు ఒకరోజు ప్రక్క ఊరికి పనిమీద
వెళ్ళసాగారు. వాళ్ళు వెళ్తున్న దారిలో కొంత దూరంలో వారికి ఒక మూట కనిపించింది. శ్యాము
పరిగెత్తి ఆ మూటను అందుకున్నాడు. ఆమూటని తెరచి చూడగా మూట నిండా బంగారునాణాలు
కనిపించాయి. "అబ్బా! నేను ఎంత అదృష్టవంతుణ్ణి అందుకే నాకు అనుకోకుండా ఇన్ని
బంగారునాణాలు దొరికాయి" అని తన వెనుక ఉన్న కృష్ణతో అన్నాడు. ఆమాటలు విన్న
కృష్ణ "నేను అని కాదు అనవలసింది మనం అదృష్టవంతులం అని అనాలి" అన్నాడు
కృష్ణ శ్యాముతో. ఆ మాటలకు శ్యాము
"అదెలా కుదురుతుంది మూటచూసింది మనమిద్దరమే అయినా ముందుగా దక్కించుకుంది నేను
కాబట్టి ఈ సంపాదకు నేనే హక్కుదారుని కాబట్టిఈ అదృష్ట౦ నాదే!" అని కోపంగా
అన్నాడు. ఆ మాటలు విన్న కృష్ణ గొడవపడడం ఇష్టం లేక మౌనంగా ఉన్నాడు. కొద్దిదూరం
నడిచీనడవగానే వెనుక నుండి అదిగో దొంగా! దొంగా! పట్టుకోండి అంటూ పెద్దగా అరుపులు
వినిపించాయి. మిత్రులిద్దరు ఆ అరుపులకు వెనుతిరిగి చూడగా, కొంతమంది కోపంతో
కర్రలు,కట్టెలు పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అది చూసి భయంతో శ్యాము
"అరరే వాళ్ళంతా మన దగ్గరకే వస్తున్నారు నా చేతిలో ఉన్న ఈ సంచి చూస్తే మనల్ని
చితక్కొడతారు" అన్నాడు వణికిపోతూ, దానికి కృష్ణ "మనం కాదు నువ్వు దొరికిపోతావు. నిన్ను
చితక్కొడతారు. ఈసంచితో నాకేమి సంబంధం లేదని నువ్వేగా అన్నావు. ఈసంచి దొరికిన
అదృష్టం అంతా నీదే అన్నావు కదా! కనుక నాకేమి సంబంధం లేనప్పుడు నాకేమి భయం. ఇప్పుడు
మనం అని అంటున్నవే ఎందుకు? ఈ దెబ్బలు కూడా నీవే తినాలి అంటూ చక్కాపోయాడు.
నీతి: ఇతరులతో మన అదృష్టాన్ని మనం
పంచుకోనప్పుడు వాళ్ళూ మన దురదృష్టాన్ని పంచుకోలేరు కదా! అన్నదే ఈ కథలోని నీతి.
No comments: