పరివర్తన


పరివర్తన
ఒక ఊరిలో సీతయ్య,కృష్ణయ్య అనే ఇరుగుపొరుగు వాళ్ళు ఉండేవారు. సీతయ్య ఎంతో మర్యాదస్తుడు. అందరితో మంచిగా ఉంటూ, అందరి మన్ననలు పొందేవాడు. కృష్ణయ్య ఎప్పుడు ఎవరితోనో ఒకరితో గొడవ పడుతూ, దురుసుగా వ్యవహరించేవాడు. అతడి దురుసుతనానికి ఊర్లోని వారందరికీ నచ్చేది కాదు. అందరు సీతయ్యను మెచ్చుకోవడం చూస్తుంటే కృష్ణయ్యకు సీతయ్య మీద చాల అసూయ కలిగింది. ఎలాగైనా సరే సీతయ్యకు కోపం వచ్చేలా చేయాలని అతనితో గొడవ పెట్టుకోవాలని ఆగొడవ చూసి ఊర్లోని వారందరు సీతయ్యను తిట్టాలని అనుకున్నాడు. ఒకరోజు రాత్రి బురద తీసుకొని సీతయ్య ఇంటిపైన చల్లాడు. ఉదయం నిద్ర లేవగానే తన ఇంటిపైన పడిఉన్న బురదను చూసి ఎవరు వేసింది అర్థమైంది సీతయ్యకు. అయినా నిందించకుండా మౌనంగా తన గోడలను నీళ్ళతో శుభ్రంగా కడుక్కున్నాడు. సీతయ్య ముఖంలో ఎలాంటి బాధగాని,కోపంగాని కనిపించలేదు. ఇది చూసిన కృష్ణయ్యకు మనసులో దిగులు పట్టుకుంది. ఎలాగైనా సరే సీతయ్యకు కోపం తెప్పించాలనుకొని మర్నాడు మరింత ఎక్కువగా బురద తీసుకొని సీతయ్య ఇంటిపై చల్లాడు, మరుసటి రోజు తన ముఖంలో ఎలాంటి భావం ప్రకటించకుండా తన ఇంటిపై ఉన్న బురదను శుభ్రం చేసుకున్నాడు సీతయ్య. అలా వారం రోజులు కృష్ణయ్య బురద చల్లడం సీతయ్య మౌనంగా తన ఇంటిపై పడిన బురదను శుభ్రం చేసుకోవడం జరిగింది. అలా వారం గడిచిన తర్వాత ఇక భరించలేకపోయాడు కృష్ణయ్య. ఇక ఆగలేక సీతయ్య ఇంటికి వెళ్లి "నేను రోజు నీ ఇంటిపైన బురద చల్లుతున్నాను నేనే చల్లుతున్నానని నీకు తెలిసి కూడా నువ్వు ఒక్క మాట కూడా అనకుండా మౌన౦గా,ప్రశాంతంగా నీఇంటిపై నేను చల్లిన బురదను శుభ్రం చేసుకుంటూనే ఉన్నావు. నన్ను పిలచి ఒక్కమాటైనా అనలేదు. కనీసం ఎదురుగా తిట్టలేకపోయినా,పరోక్షంగానైనా తిట్టడానికి ప్రయతించలేదు. నేను ఇంత పని చేసినా గాని నీకు ఎందుకు కోపం రాలేదు" అని అడిగాడు కృష్ణయ్య. కృష్ణయ్య చెప్పినదంతా ప్రశాంతంగా విన్న సీతయ్య చిన్నగా నవ్వుతూ "నువ్వు నాఇంటి గోడ మీద బురద చల్లి నన్ను కష్టపెడుతూ సంతోషపడుతున్నావు. కానీ నాగోడ మీద నీవు బురద చల్లే ముందు నీచేతులు బురదలో ము౦చుతున్నావని తెలుసుకోలేకపోయావు. నాగోడ మీదకంటే నీచేతులే బురదలో ముంచిముంచి మురికిగా తయారయ్యాయి అది నీవు గ్రహించలేకపోయావు. మనం ఇతరులకు చెడు చేయాలనుకుంటే అది ముందుగా మనకే తగులుతుంది అన్నది నీవు తెలుసుకోవాలి" అని సీతయ్య కృష్ణయ్యకు ఎంతో మర్యాదగా, తన తప్పు తాను తెలుసుకునేలా, పశ్చాత్తాపపడేలా చెప్పాడు. సీతయ్య మాటలు విన్న కృష్ణయ్యకు కనువిప్పు కలిగింది. తాను చేసిన తప్పుకు ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. అప్పటినుంచి కృష్ణయ్య ఎవరితోనూ గొడవలు పడకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరితో మంచిగా, మర్యాదగా మెలగసాగాడు. కృష్ణయ్యలో వచ్చిన పరివర్తన చూసి సీతయ్యతో పాటు గ్రామస్తులంతా కూడా ఎంతో సంతోషించారు.
నీతి: "ఒకరికి చెడుచేయాలని చూస్తే ముందుగా మన మీదే అది ప్రభావం చూపిస్తుందన్నదే" ఈ కథలోని నీతి.    

No comments:

Powered by Blogger.