ఆ నవ్వు వెనుక...


ఆ నవ్వు వెనుక...
అది అయోధ్యానగరం. మరి కొద్దిసేపట్లో శ్రీరామపట్టాభిషేక మహోత్సవం జరగబోతుంది. సకల సన్నాహాలు జరుగుతున్నాయి. రామచంద్రమూర్తికి అయోధ్యా నగర చక్రవర్తిగా పట్టం కట్టే ఆ మహోత్సవాన్ని కన్నులారా చూడాలని నగర ప్రజలతో పాటు దూర దేశాల నుండి ఎందరో మహానుభావులు, మహర్షులు, వస్తూ వస్తూ వెంటపెట్టుకొని వచ్చిన వానరులతో పాటు ఎందరో ప్రముఖులు, పెద్దలు ఉన్నరక్కడ. ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నాగాని అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంతలో ఎక్కడినుంచో నవ్వు వినపడింది. ఆ వెంటనే చిటికెలు వేస్తున్న శబ్దం వినిపించింది. అందరు ఆ నవ్వు వినిపించిన దిశగా చూశారు. నవ్వుతున్నదేవరో చూసి, ఆశ్చర్యపడ్డారు. ఆ నవ్విన వారు లక్ష్మణుడు. ఇంతకూ లక్ష్మణుడు ఎందుకు నవ్వినట్లు, తమను చూసేమోనని అందరు అనుకోసాగారు." ఎట్టకేలకు నాకడుపునా పుట్టిన రాముడికే పట్టాభిషేకం జరుగుతున్నందుకు కాబోలు" అని ముందుగా కౌసల్య అనుకొంది. " భరతుడి రాజ్యం ఇంతటితో చెల్లిపోయి౦ది, కైక తిక్క కుదిరింది కాబోలు" అని కైకేయి అనుకొంది. "తనకూ, తన సోదరుడు శత్రుఘ్నుడికి, ఎల్లప్పుడూ సేవకులుగా ఉండక తప్పడంలేదని విరక్తిగా నవ్వుకున్నడేమో అని లక్ష్మణుడి తల్లి సుమిత్ర అనుకొంది. తన అన్నను, చంపి తనను రాజుగా చేసినందుకే రామ పట్టాభిషేకానికి విచ్చేశామనే లక్ష్మణుడు నవ్వుతున్నాడేమో అని సుగ్రీవుడు, విభీషణుడూ అనుకొన్నారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చిన తన తొందరపాటును, తెలివితక్కువతనాన్ని చూసి లక్ష్మణుడు నవ్వుతున్నాడేమో అని హనుమంతుడు అనుకున్నాడు. ముసలివాడినై పోయి,కళ్ళు సరిగ్గా కనపడక, చెవులు స్పష్టంగా వినపడక, ఒకరి సాయం ఉంటె తప్ప నడవలేని స్థితిలో ఉండి కూడా రామ పట్టాభిషేకానికి వచ్చిన తనని చూసే నవ్వాడేమో అని జాంబవంతుడు అనుకొన్నాడు, 




రావణుడి చెరలో అంతకాలం పవిత్రంగా ఉంది కూడా, చివరకి తనను అగ్ని పరీక్షా చేయించి కానీ, తనని ఎలుకోడానికి తన నాదుడు సిద్దపదలేదని తనని చూసే లక్ష్మణుడు నవ్వి ఉండవచ్చునని సీతా దేవి, 



హనుమంతుడు కనిపెట్టేదాకా సీత జాడ కనిపెట్టలేకపోవడం, వానరుల సాయం ఉంటె తప్ప, రావణుడిని వధి౦చలేకపోయిన తనను చూసే తమ్ముడు నవ్వి ఉంటాడని రాముడుఅనుకొన్నాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా అనుకొన్నారట లక్ష్మణుడి నవ్వు చూసి.
       నిజానికి లక్ష్మణుడు నవ్వింది పైకారణాలలో ఏ ఒక్క దానివల్ల కాదు.ఏ ఒక్కరిని చూసి నవ్వుకోలేదు. తన దుస్థితికి తన మీద తనకే జాలివేసి, నవ్వుకున్నాడట. అదేమిటంటే, వనవాసానికి వెళ్తున్న రాముడి వెంట లక్ష్మణుడు బయలుదేరాడు. ఆ తర్వాత సీతామాత కూడా బయలుదేరింది. ఎంత బతిమాలినా, ఇంకెంత నచ్చజెప్పినా, చివరకు బయపెట్టిన కూడా సీతాదేవి వినకుండా రాముడి వెంట వనవాసానికి బయలుదేరింది. సరిగ్గా అప్పుడే లక్ష్మణుడి పత్ని ఊర్మిళ కూడా లక్ష్మణుడి వంక దీనంగా చూసిందట, తాను కూడా వనవాసానికి వస్తానని అన్నట్టుగా... అయితే లక్ష్మణుడు వద్దన్నట్లుగా కన్నులతోటి సైగ చేసి చెప్పాడట. అయితే తాను లేక తన పత్ని వియోగ భాదను అనుభవిస్తు౦దేమోననే ఉద్దేశ్యంతో, తాను వనవాసంలో ఉన్నంత కాలమూ తన నిద్రను కూడా తన పత్నికే ఇవ్వమని నిద్రా దేవతను కోరాడట. అంతే కాదు, అన్నావదినలకు కాపలా కాయాలి కాబట్టి, దయచేసి తన జోలికి రాకుండా ఉండమని నిద్రా దేవతను పరిపరివిధాల ప్రార్ది౦చాడట! అందుకు అంగీకరించిన నిద్రాదేవి, పద్నాలుగేళ్ళ పాటు ఓపిక పట్టి, తీరా తాను ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రామపట్టాభిషేక మహోత్సవ సమయంలో ఎంత చెప్పినా, తన మాట వినకుండా తనని ఆవహించెందుకు వస్తో౦దని నవ్వు వచ్చిందట. అంతమంది సభాసదుల మధ్యలో తన అన్నగారైన రామచంద్రమూర్తికి పట్టాభిషేక మహోత్సవం జరిగేటప్పుడు నిద్రపోయి తన పరువు తీయకుండా కనీసం మరికొద్ది సమయం అయినా గడువు ఇవ్వమని బ్రతిమాలుకున్నాడట లక్ష్మణుడు.
     ఈ కథ పుక్కిటి పురాణమే కావొచ్చు, ఏ పండితుడో, కవో సరదా కోసం అసలు విషయానికి మరికొంత ముందు వెనకలు జోడించి ఉండవచ్చు, దీనిపై లక్ష్మణదేవర నవ్వు, ఊర్మిళాదేవి నిద్ర అని ఉపాఖ్యానాలే వెలువడి ఉండవచ్చు కానీ, నిద్ర అనేది మనిషికి ఎంత అవసరమో, సమయానికి నిద్ర పోకపోతే ఎంత అనర్ధమో, అసందర్భంగా నిద్రపోవడం ఎంత హాస్యాస్పదమో ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు.                                             

No comments:

Powered by Blogger.