ధర్మతత్పరత


ధర్మతత్పరత
దిలీప మహారాజు భార్య సుదక్షిణాదేవి.వారికి సకల సంపదలు ఉన్నాయి. కానీ సంతానం లేదు. ఒకసారి వశిష్ట మహర్షి వద్దకి వెళ్లి సంతానం కలిగే తరుణోపాయం చెప్పమని కోరారు. అయన తన వద్దనున్న నందిని అనే ధేనువును ఆ రాజ దంపతులకిచ్చి "దీనిని నిష్ఠగా సేవించండి.తప్పక సంతాన ప్రాప్తి కలుగుతుంది"అని చెప్పాడు. ఆ దంపతులు ఆవుని తీసుకొని వెళ్లి భక్తి శ్రద్దలతో సేవించ సాగారు. రాజు దానిని అడవికి తీసుకవెళ్ళి, అది మేత మేసిన తర్వాత తీసుకోచ్చేవాడు. ఒకరోజు రాజు ఏమరపాటుగా ఉన్న సమయంలో ఆ ఆవు కాస్త తప్పిపోయింది. రాజు దాని కోసం వెతుకుతుండగా సమీపంలో ఉన్న ఒక గుహనుంచి దాని అంబారావాలు వినిపించాయి. వెంటనే ఆ గుహలోకి ప్రవేశించాడు రాజు.
      అక్కడ ఆ అవును ఒక సింహం చంపి తినడానికి సిద్ధంగా ఉంది. దిలీపుడు వెంటనే బాణం సందించబోయాడు. చిత్రం! వెంటనే అయన చేయి స్తంభి౦చిపోయింది. ఆశ్చర్యంతో నిలబడిపోయిన రాజుతో ఆ సింహం మానవ భాషలో "రాజా! నేను శివుడికి అత్యంత ఆప్తుడను. నా పేరు కుంభోధరుడు. శివుడు నందిని అధిరోహించే ముందు నాఫై కాలుపెట్టి ఎక్కుతాడు. ఈ గుహలోకి ప్రవేశించిన పశుపక్ష్యాదులను తినడం నా హక్కు. ఇప్పుడు ఈ ఆవుని చంపి తిని ఆకలి తీర్చుకుంటాను, అడ్డులే" అంటూ తొందర చేశాడు కుంభోధరుడు.
     "మా గురువు వశిష్టుడు దీని భాద్యతను నాకు అప్పగించాడు. నా సంరక్షణలో ఉన్న ఈ అవును విడచిపెట్టు లేదా, నేనే దీనికి బదులు నీకు ఆహారం అవుతాను" అన్నాడు దిలీపుడు.
     "పిచ్చివాడా! ఆవు కోసం ప్రాణాలు ఎవరైనా వదులుకొంటారా! నీవు రాజువు. నీ ప్రాణాలు ఉంటె ఇటువంటి వెయ్యి ఆవులను దానంగా ఇవ్వవచ్చు కదా!" అని అన్నది సింహం.
     "అవునే కాపాడలేని వాడివి నేనింకా ప్రజల ప్రాణాలు ఏవిధంగా కాపాడగలను? అందుకే నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో" అంటూ ప్రాధేయపడ్డాడు రాజు. సింహం అంగీకరించింది. కళ్ళు మూసుకున్నాడు రాజు. అయితే,సింహం తనమీద పడకపోగా ఫైనుండి పూల వర్షం కురవడంతో పాటు, "కుమారా! లే" అన్న మాటలు వినిపించాయి. ఆశ్చర్యంగా కళ్ళు తెరిచాడు రాజు. అక్కడ సింహం లేదు. "రాజా! నీ ధర్మతత్పరతకు మెచ్చాను. నా పాలు పిండి, నీవు, నీ భార్య ఇద్దరు త్రాగండి సత్సంతానం ప్రాప్తిస్తుంది" అని చెప్పింది నందిని. దిలీప మహారాజు ఆ ఆవు చెప్పిన విధంగా పాలు పితికి తాను తాగి,భార్యకి కుడా త్రాగించాడు. వారికి పండంటి బిడ్డ కలిగాడు. ఆ బిడ్డే రఘుమహారాజు. ఈయనే రాముడి తాతగారు. ఈయన పేరుమీదుగానే రఘువంశం ఏర్పడింది. రాముడు ఈయన నుండే ధర్మాన్ని పోనికిపుచ్చుకొని రఘురాముడయ్యాడు.    

No comments:

Powered by Blogger.