తగినశాస్తి
తగినశాస్తి
ధర్మపురి అనే ఊరి దగ్గరలో ఒక అడవి
ఉండేది. ఆ అడవి నుండి ఒకరోజు ఒకచిన్న ఏనుగు పిల్ల దారితప్పి ధర్మపురికి వచ్చి
చేరింది. అక్కడ ఉన్న గ్రామస్తులందరు దానిని ఎంతో ముద్దుగా చూసుకొనేవారు. ఊర్లో
పిల్లలందరు చక్కగా ఏనుగు పిల్లతో ఆడుకొనేవారు. దానికి ఒక ముద్దు పేరు కుడా పెట్టుకున్నారు.
అందరూ "చిట్టి" అనే పేరుతో పిలవగానే ఏనుగుపిల్ల ఆనందంగా దగ్గరకు
వచ్చేది. అది రోజు చెరువుకు వెళ్లి నీరు తాగి వచ్చేది. అలా వెళ్ళే దారిలో రాము
కిరాణ దుకాణ౦ ఉంది. అలవాటు ప్రకారం అది రోజు రాము కిరాణ దుకాణం దగ్గరకి వెళ్లి
రాము ఇచ్చే అరటిపండ్లు తిని అక్కడినుండి సంతోషంగా వెళ్ళేది. రోజు రాము అరటిపండ్లు
ఏనుగుకి ఇవ్వడం, అది ఆనందంగా తినడం చూస్తూ౦డేవాడు పక్కన ఉన్న బట్టల దుకాణంలోని యాజమాని సోము. అతడికి ఇదంతా
పెద్దగా నచ్చలేదు. రాము మీద చాల అభిమానం చూపిస్తుందని ఏనుగు పిల్ల మీద కోపం
పెంచుకున్నాడు సోము. ఎలాగైనా దానిని ఏడిపించాలనుకున్నాడు. తగిన సమయం కొరకు
ఎదురుచూడసాగాడు. తాను ఏమిచేసినా నోరు లేని జీవి కనుక తిరిగి ఏమి చేయలేదులే
అనుకున్నాడు. ఒకరోజు అలవాటు ప్రకారం చెరువుకు వెళ్ళుతూవెళ్ళుతూ ఏనుగుపిల్ల రాము
దుకాణం వద్దకు వచ్చి౦ది. కానీ ఆసమయంలో రాము దుకాణంలో లేడు. ఇది గమనించిన సోము
ఏనుగు పిల్లను దగ్గరకి రమ్మని పిలచాడు. సోము తనకి తినడానికి ఏమో ఇస్తున్నాడని
అమాయకంగా నమ్మిన ఏనుగుపిల్ల తన తొండాన్ని సోము ముందుకు చాచింది. ఇదే అదునుగా
తీసుకొని సోము ఒక పెద్ద సూదితో ఏనుగుపిల్ల తొండం మీద గట్టిగా పొడిచాడు. బాధతో
విలవిల్లాడుతూ ఏనుగుపిల్ల మెల్లగా ఘీ౦కరిస్తూ వెనక్కి వెళ్లిపోయింది. ఏనుగుపిల్లను
ఏడిపించినందుకు బాగా సంతోష పడిపోయాడు సోము. కాసేపటికి ఏనుగుపిల్ల చెరువు నుండి
తిరిగి వస్తూ తన తొండం నిండా బురద నింపుకొని వచ్చి, సోము బట్టల దుకాణం నిండా
ఆబురదంతా చిమ్మేసి అక్కడినుంచి నెమ్మదిగా వెళ్లిపోయింది. పండగకని అమ్మకానికి
తెచ్చిన ఖరీదైన బట్టలన్నీ బురదతో నిండిపోయాయి. అమాయకమైన జీవిని ఏడిపిస్తే తిరిగి
అది ఏమి చేయలేదులే అనుకున్న సోముకు తగినశాస్తి చేసింది ఏనుగుపిల్ల. తన కొట్టులో
ఉన్న ఖరీదైన బట్టలన్నీ పాడైపోయి తీవ్ర నష్టానికి గురైనా సోము లబోదిబోమన్నాడు.
నీతి: ప్రతిప్రాణి పట్ల మనం దయతో ఉండాలి.
వాటికి ఎలాంటి హానీ తలపెట్టకూడదు అన్నది ఈ కథలోని నీతి.
No comments: