విషయ పరిజ్ఞానం


విషయ పరిజ్ఞానం
యమునా నదీ తీరంలో తీర్థానందస్వామి అనే గురువు ఉండేవారు. అయన గురుకులంలో ఎందరో శిష్యులు విద్యను అభ్యసిస్తుండేవారు. వారిలో నరేంద్రుడు,విజయే౦ద్రుడు అనే శిష్యులు ఉండేవారు. వారిద్దరికి విద్యలో భాగంగా సమాజాన్ని దగ్గర నుండి చూసి పరిశీలించే అవకాశం వచ్చింది. దీనిలో భాగంగానే వారిద్దరిని పిలచి "నాయనా మీరిద్దరు కొన్ని రోజులపాటు దేశమంతా తిరిగి ఎంతమంది మంచివాళ్ళు ఉన్నారో, ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారో లెక్కపెట్టుకొని తిరిగి రండి" అని చెప్పారు తీర్థానందస్వామి. తమ గురువు మాటలు విన్న నరేంద్రుడు,విజయే౦ద్రుడు గురువుగారి ఆశీస్సులు తీసుకొని పర్యటనకు బయల్దేరారు. కొద్దిరోజులు దేశమంతటా సంచరించి వారు గురువుగారిని దర్శించుకున్నారు. "నాయానా మీరు మీ పర్యటన వివరాలు వివరించండి" అని అడిగారు. దీనికి నరేంద్రుడు ఇలా వివరించాడు "లోకంలో మంచితనం మచ్చుకైన లేదు, ఒక్క మంచివాడు కూడా కనిపించలేదు" అంటూ ఎంతో ఆవేదనగా తన అభిప్రాయాన్ని గురువుకు విన్నవించాడు. ఇక రెండవ శిష్యుడు విజయే౦ద్రుడు గురువు గారితో ఇలా అన్నాడు "గురువర్యా! నాకు అందరు మంచివాళ్ళే తారసపడ్డారు ఇంతవరకు ఒక్క చెడ్డవాడిని కూడా నేను చూడలేదు" అని సంతోషంగా గురువుకు వివరించాడు. ఇద్దరు కలిసి గురువుగారితో తామిరువురిలో ఎవరి అభిప్రాయం సరైనదో గురువుగారినే వివరించమన్నారు. దానికి గురువు గారు చిరునవ్వు నవ్వి తన శిష్యులకు ఇలా వివరించారు. " ప్రపంచమంతా పూర్తిగా మంచిగాను ఉండదు, పూర్తిగా చెడుగాను ఉండదు. సమాజం అంటేనే మంచిచెడుల కలయిక మనం ఏ దృష్టితో చూస్తే అదే దృష్టితో కనిపిస్తుంది. చెడు ఆలోచనలు ఎక్కువగా ఉన్న నరేంద్రుడికి అందరూ చెడ్డవారిలాగానే కనిపించారు. మంచి ఆలోచనలు ఉన్న విజయే౦ద్రుడికి అందరూ మంచివారిలాగానే కనిపించారు.కనుక మీరిద్దరు మీఆలోచన విధానాన్ని మార్చుకొని  "మంచిచెడుల కలయికే మానవసమాజం" అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటూ తన శిష్యులిద్దరికి వివరించారు తీర్థానందస్వామి.      

No comments:

Powered by Blogger.