అలకాధిపుని అహమణచిన బాలగణపతి |
అలకాపురాధీసుడు, ధనాధిపతి కుబేరునికి తన సంపాదనంతా
చూసుకునేసరికి అహంకారం తలెత్తింది. ముల్లోకాలలో తనను మించిన ధనవంతుడే
లేడనుకున్నాడు. తన వైభోగాన్ని చాటుకునేందుకు దేవతలందరికీ గొప్ప విందు ఇవ్వదలచుకున్నాడు.
అనుకున్నదే తడవు సమస్త దేవతలను విందుకు ఆహ్వానించాడు. ఒంటి నిండా బూడిద పూసుకుని,
మొలకు గజచర్మాన్ని చుట్టుకుని, స్మశానాలలో పుర్రెపట్టుకుని పొట్టపోసుకునే
పరమేశ్వరుడు అంటే చిన్న చూపు. ఆయనను విందుకు పిలవకూడదు అనుకున్నాడు. అయినా, తన
వైభోగాన్ని చాటు కోవాలంటే పిలవక తప్పదు అనుకుని, అయిష్టంగా వెళ్ళాడు. పరమేశ్వరునికి
కుబేరుడి ఆంతర్యం అర్థమైంది. కపట భక్తి నటిస్తూ, తనను పిలిచేందుకు వచ్చిన
కుబేరునితో "అలకాధీశా! అనివార్య కారణాలవల్ల నేను విందుకు రాలేక పోతున్నాను.
కానీ నా బదులుగా నా పెద్ద కుమారుడిని పంపుతాను.అతనికింత అన్నం పెడితే చాలు-నా
కడుపు నిండి పోతుంది" అన్నాడు. సరేనంటూ సమ్మతించాడు అలకాధిపుడు తీరా, విందు
రోజు రానే వచ్చింది. దేవతలందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇంతలో గుజ్జురూపంలో ఉన్న
బాలగణేశుడు వచ్చాడు. వస్తూనే బొజ్జ నిమురుకుంటూ "ఆకలి" అన్నాడు.
పసిపిల్లవాడు కదా ముందుగా పెట్టేద్దాం అనుకున్నాడు కుబేరుడు. వెంటనే బంగారు
విస్తరిణి పరిచి అందులో కొద్ది కొద్దిగా భోజన పదార్థాలు, పిండి వంటలు వడ్డింపించాడు.
వాటన్నింటినీ కలిపి ఒక ముద్దగా చేసి నోట్లో పెట్టుకుని, ఇంకాస్త... అన్నట్లు
చూశాడు. చిన్నవాడైన తిండిపుష్టి కలవాడే! అనుకున్న కుబేరుడు ఈసారి ఇంకొద్దిగా
ఎక్కువ మొత్తంలో వడ్డింపించాడు. కన్ను మూసి తెరిచేలోపు అంతా ఖాళీ అయింది. ఇలా
కుబేరుని దాసీజనం వడ్డిస్తూనే ఉన్నారు, పదార్ధాలన్నీ ఖాళీ అయిపోతునే ఉన్నాయి కానీ
వినాయకుడి చిన్న బొజ్జ నిండడం లేదు. తన శక్తితో ధనాగారంలోని స్వర్ణరాశులు అన్నింటినీ
ఆహారంగా మార్చి బాల గణపతి కి భోజనంగా అందిస్తున్న అదంతా హాంఫట్ అయిపో సాగింది.
వినాయకుడికి బొజ్జ నిండక పోవడంతో అందుబాటులో ఉన్న వంట పాత్రలను కూడా కరకరా నమిలి
తినేయసాగాడు. ఆయనకు తోడు ఆయన మూషికం కూడా వీరవిహారం చేయసాగింది. ఈలోగా దేవతలు
అందరూ విచ్చేసి, వడ్డన కోసం ఎదురు చూడసాగారు. అందరి ముందు పరువు పోయే పరిస్థితి
తలెత్తడంతో ఏం చేయాలో పాలు పోలేదు కుబేరునికి. దాంతో తన తప్పు తెలిసి వచ్చి,
పార్వతీ పరమేశ్వరుల వద్దకు పరిగెత్తుకొని వెళ్లి, వారి పాదాల మీద వాలి శరణు కోరాడు.
అప్పుడు పార్వతి చిరునవ్వుతో కాసిన్ని బియ్యాన్ని నీటితో తడిపి, పంచాక్షరీ మంత్రంతో అభిమంత్రించి బాల గణేశుని నోటిలో పెట్టింది. అమ్మ పెట్టిన ఆ బియ్యపు గింజలతో బాల గణపతి బొజ్జ నిండి, బ్రేవుమని త్రేన్చాడు. పరమేశ్వరుడి అనుగ్రహంతో భోజన పదార్థాలన్నీ యథా ప్రకారం నిండిపోయాయి. దేవతలందరూ తృప్తిగా విందు భోజనం చేసి, కుబేరుని కొనియాడుతూ ఇళ్ళకు వెళ్లారు. కుబేరుడు జీవితంలో మరెన్నడూ అహాన్ని ప్రదర్శించలేదు.
అప్పుడు పార్వతి చిరునవ్వుతో కాసిన్ని బియ్యాన్ని నీటితో తడిపి, పంచాక్షరీ మంత్రంతో అభిమంత్రించి బాల గణేశుని నోటిలో పెట్టింది. అమ్మ పెట్టిన ఆ బియ్యపు గింజలతో బాల గణపతి బొజ్జ నిండి, బ్రేవుమని త్రేన్చాడు. పరమేశ్వరుడి అనుగ్రహంతో భోజన పదార్థాలన్నీ యథా ప్రకారం నిండిపోయాయి. దేవతలందరూ తృప్తిగా విందు భోజనం చేసి, కుబేరుని కొనియాడుతూ ఇళ్ళకు వెళ్లారు. కుబేరుడు జీవితంలో మరెన్నడూ అహాన్ని ప్రదర్శించలేదు.
No comments: