గజాసురుని సత్యసంధత |


గజాసురుని సత్యసంధత
పూర్వం గజాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. అతను మహా శివభక్తుడు. శివుని గురించి తపస్సు చేసి, ప్రసన్నం చేసుకున్నాడు.తన ఉదరంలోనే నివసించేలా వరం కోరుకున్నాడు. సరేనంటూ వెంటనే ఆ అసురుడి ఉదరంలోకి ప్రవేశించి అక్కడే ఉండిపోయాడు ఉబ్బుశంకరుడు. తన స్వామి లాగే ఈ అసురుడికి కూడా ఒక బలహీనత ఉంది. అదేమంటే గంగిరెద్దుల ఆట. తన వద్దకు గంగిరెద్దులు ఆడేవారు ఎవరైనా వస్తే చాలు, వారి ఆటచూసి, నచ్చితే, గొప్ప బహుమతులు ఇచ్చి పంపుతుండేవాడు. అదే బలహీనత విష్ణువుకు ఆయుధంగా మారింది. తన భర్త ఎక్కడున్నాడో తెలియక తల్లడిల్లుతున్న పార్వతిని ఊరడించి, ఎక్కడున్నా సరే, తీసుకువస్తానని చెప్పిన విష్ణుమూర్తి, శివుడు గజాసురుడనే రాక్షసుడు ఉదరంలో ఉన్నట్లు తెలుసుకున్నాడు.నందిని గంగిరెద్దుగా మార్చి, బ్రహ్మదేవుడు తాను నాదస్వర విద్వాంసులుగా, ఇంద్రాది దేవతలు తలోవాద్యం వాయిస్తూ వెళ్లి గజాసురుని ఇంటి ముంగిట అత్యద్భుతంగా గంగిరెద్దును ఆడించాడు. సాక్షాత్తు నందీశ్వరుడే ఆడిన ఆ ఆటను చూసి ఆనందించిన గజాసురుడు "నీకు ఏం వరం కావాలో కోరుకో, ఇస్తా" అన్నాడు పరవశంలో. "నీ ఉదరంలోని శివుడు కావాలి" అన్నాడు విష్ణువు. తన బలహీనతే తన మృత్యువును తెచ్చి ఎదుట నిలిపిందని అర్థమైంది గజాసురుడికి. అయినా సరే, తపస్సు వల్ల వచ్చిన సత్యసంధత, సంస్కారం, సాక్షాత్తు పరమేశ్వరుడినే ఉదరంలో నిలుపుకోగలిగిన శారీరక పుణ్యం ఆ మరణాన్ని ధీరోదాత్తంగా ఆహ్వానించేలా చేశాయి. "ఈశ్వరా! నేను చచ్చినా, నా శిరస్సు త్రిలోకాలకు పూజనీయం కావాలి. నా చర్మాన్ని నీవు ధరించాలి". అని చివరి కోరిక కోరి, నంది తన వాడి అయిన కొమ్ములతో తన ఉదరాన్ని చీల్చడానికి అనుమతించాడు.
ఆ భక్తుని కోరికను మన్నించిన బోళాశంకరుడు ఆ గజచర్మాన్ని తన శరీరానికి అచ్ఛాదానగా చుట్టుకొని, గజాసురుని శిరస్సును తీసుకునివెళ్లి, తాను స్వయంగా శిరస్సు ఖండించిన వినాయకుడి మొండానికి శిరస్సుగా అమర్చి, త్రీలోకాలలోనూ పూజింపచేశాడు. తన కుమారుడి వికార రూపానికి విచార పడలేదు సరికదా, మరణించిన తన భక్తుడి శిరస్సును చూస్తూ, అతని భక్తిని తలుచుకుంటూ ఉండిపోయాడు పరమశివుడు. రాక్షసులు అనగానే వాళ్ళు చెడ్డవాళ్ళు అనే భావన అందరికీ ఉంటుంది. అయితే, వారు కూడా మహా బలవంతులే. అసహాయ శూరులే. శిరస్సు మీద ధరించి, పాతాళానికి వెళ్లిపోతే, గయాసురుడు తన శరీరాన్ని యజ్ఞపీఠ0గా చేసుకునేందుకు దేవతలకు అనుమతి ఇచ్చి, తాను మరణించిన చోటును పితృదేవతలకు పిండ ప్రదానం చేసే పరమ పవిత్రమైన స్థలంగా మార్చుకున్నాడు. ఇక్కడ చెప్పవచ్చేదేమిటంటే, రూపాన్ని బట్టి, జాతిని బట్టి వారు చెడ్డవారని అనుకోడానికి వీలులేదు.  ఒకవేళ చెడ్డవారైనా కూడా, వారు చివరి వరకు కట్టుబడిన ఒక్క మంచి లక్షణం వల్ల లోకంలో శాశ్వతమైన కీర్తిని సంపాదించుకోగలిగారు.

No comments:

Powered by Blogger.