తారా చంద్రులు |
తారా చంద్రులు
దేవతలతో చంద్రుడు అత్యంత సుందరమైన వారిలో ఒకడిగా పేరు పొందాడు. అయితే, అంతటితో తృప్తి కలగలేదు చంద్రుడికి. ఒక అందంలోనే కాదు, త్రిలోకాలలోను తనంతటి మహాజ్ఞాని లేడనిపించుకోవాలని అనుకున్నాడు . దాంతో దేవతల గురువైన బృహస్పతి వద్ద శిష్యునిగా చేరాడు. బృహస్పతి భార్య తార అపురూప లావణ్యవతి, నవయవ్వనవతి.
చంద్రుడు ఆశ్రమంలో విద్యాభ్యాసానికి చేరిన నాటి నుంచి తార అతని అందచందాలకు,యవ్వన సౌందర్యానికి ముగ్ధురాలై, అటు అటువంటి సుందరాంగుని భర్తగా పొందలేకపోయానేనని మనసులో బాధపడుతూ చాటునుంచి చంద్రుని వైపు దొంగ చూపులు చూస్తూ ఉండేది. చంద్రుడు గమనించాడు. అయితే గురుపత్ని కాబట్టి సాహసించలేక పోయాడు. ఇలా ఉండగా దేవేంద్రుడు ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు.ఆ యజ్ఞానికి హోతగా బృహస్పతి వెళ్ళవలసి వచ్చింది. ఆయన ఆశ్రమ రక్షణ బాధ్యతను చంద్రుడు అప్పగించి అమరావతికి వెళ్ళాడు. బృహస్పతి దేవలోకానికి వెళ్ళిపోగానే తారా, చంద్రునితో మాట కలిపింది. చంద్రుడు కూడా చొరవ తీసుకున్నాడు. ఇద్దరూ ఆనందంగా గడిపారు. క్రమంగా ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి ఏర్పడింది.ఫలితంగా తార గర్భవతి అయింది.
అంతలో యజ్ఞం ముగించుకొని బృహస్పతి రానే వచ్చాడు.ఆయన వస్తూనే అక్కడ ఏం జరిగిందో గ్రహించాడు. ఆయన చంద్రుడి వైపు ఆగ్రహంతో చూస్తూ "దుర్మార్గుడా.... గురుపత్నిని కామించిన పాపానికి నువ్వు క్షయ వ్యాధి పీడితుడవై క్షీణి0తువుగాక" అని శపించాడు. ఆ శాప ప్రభావం వల్ల చంద్రుడు తన తేజాన్ని, చంద్రకళను కోల్పోయి కాంతిహీనుడయ్యాడు. సూర్యచంద్రులలో ఎవరు లేకున్నా కాలం సక్రమంగా నడవదు. గనుక ఇంద్రాది దేవతలు పరుగు పరుగున వచ్చి వ్యాధి పీడితుడు అయినా చంద్రుడిని బృహస్పతి పాదాలపై పడవేసి, "అతన్ని క్షమించి శాపాన్ని ఉపసంహరించ"మని ప్రార్ధించారు. మనస్సు కలిగిన బృహస్పతి, "లయకారకుడైన శివుడి గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహం సంపాదించినపుడు చంద్రుడు వ్యాధి బారి నుంచి విముక్తుడై తన పూర్వ వైభవాన్ని పొందుతాడు" అని అనుగ్రహించాడు. చంద్రుడు ఆయనకి నమస్కరించి తపస్సు చేయడానికి వెళ్లిపోయాడు. ఘోర తపస్సుతో శివుని ప్రసన్నం చేసుకున్నాడు. అయితే, పాప ఫలితాన్ని అనుభవించక తప్పదు కాబట్టి, పదిహేను రోజులు వృద్ధి చెందడం, పదిహేను రోజులు క్షీణి0చేల వరం పొందాడు.
నీతి: పాపం, పాపపు ఆలోచనలు, పాపపు పనులు చేస్తే దేవతలు కూడా శిక్ష తప్పదన్నా మాట...
No comments: