కనుమరుగు కావడం సహజం |


కనుమరుగు కావడం సహజం

అది కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతం, విజేతలయిన వీరులు చివరి రోజు రాత్రి క్షేత్రంలో విశ్రమించాలని ఆనాటి ఆచారంమేరకు పాండవులను వెంటబెట్టుకొని కౌరవుల శిబిరం వద్దకు వెళ్ళాడు కృష్ణుడు. తర్వాత కృష్ణుడు అర్జునుని ఉద్దేశించి "అర్జున నీవు గాండీవాన్ని ఇతర ఆయుధాలను తీసుకొని రథం నుంచి కిందకు దిగి దూరంగా వెళ్ళు" అని ఆదేశించాడు. అర్జునుడు అణు మాత్రం సందేహించకుండా గాండీవం ఇతర ఆయుధాలను తీసుకొని రథం దిగాడు. కృష్ణుడు కూడా ఇన్నాళ్ళు సారధిగా తన చేతిలో ఉన్న చర్నాకోలను గుర్రాల కళ్లకు వేసే పగ్గాలను అక్కడే వదిలేసి రథం మీద నుండి కిందకి ఎగిరి దూకాడు. కృష్ణుడు రథం నుండి దూకిన మరుక్షణమే హనుమంతుడు గుర్తుగా నిలిచివున్న ధ్వజకేతనం అంతరిక్షంలోకి ఎగురుతుపోయీ అదృశ్యమైంది. పాండవులు ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తుండగానే రథంలో అగ్నిజ్వాలలు చెలరేగి క్షణాల్లో రథం కాస్తా బూడిదగా మిగిలింది. ఆ దృశ్యాన్ని చూసిన అర్జునుడు తట్టుకోలేకపోయాడు. ఖాండవ దహన సమయంలో అగ్ని దేవుడు అర్జునుడికి ఇచ్చిన కానుక ఆ రథం. అప్పటినుండి అర్జునికి ఆ రథానికి విడదీయరాని సంబంధం ఏర్పడింది. అలాంటి రథం దగ్ధం కావడంతో అర్జునుడు దుఃఖానికి గురయ్యాడు. అతి కష్టంమీద కన్నీటిని ఆపుకొంటూ "కృష్ణ ఎందుకిలా జరిగింది? శత్రువుభీకరమైన ఈ రథం ఎందుకిలా" ఆపై మాట్లాడాలంటే గొంతు పెగలలేదు అర్జునుడికి. కృష్ణుడు తన సహజశైలిలో చిరునవ్వు నవ్వాడు. "అర్జునా! నీ రథం అసమాన్యులైనా! భీష్మ ద్రోణాదులు ఇతర వీరుల భయంకర ప్రభావానికి గురైంది. నేను సారధిగా ఉండి వారి అస్త్రాల శక్తిని అణచి వుంచాను. నీవు సురక్షితంగా బయటపడ్డావు కథ ముగిసిపోయింది. చివరగా నేను దిగిపోగానే ఆ అస్త్రాలశక్తిని వదలడంతో అది కాలి దగ్ధమయ్యింది. ఇక దానితో నీకు పని లేదు, నిర్దేశిత కార్యం కోసం వచ్చిన అవతారపురుషులు, వస్తువులు ఆ కార్యం పూర్తి కాగానే కనుమరుగు కావడం సహజం! ఆ కోవలోనే ఈ రథం తన కర్తవ్యాన్ని నిర్వహించి, అదృశ్యమయింది. పుట్టిన ప్రతి జీవికి నిశ్చితమైన లక్ష్యం, కార్యకలాపాలు ఉంటాయి. తన లక్ష్యం సాధించుకున్న తర్వాత, ఆ జీవితో ప్రపంచానికి గానీ, ప్రపంచానికి జీవితో గానీ, అవసరం ఉండదు. అప్పుడు భూమిని విడిచి వెళ్ళి పోతాడు. లేకపోతే భూమికి భారమే కదా! కాబట్టి నీవు ఈ విషయాన్ని గుర్తించుకో, రథం కోసం దుఃఖించకు!" అని ఊరడించాడు. ఇది ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన నీతి.

No comments:

Powered by Blogger.