జటాయువు పోరాటం |


జటాయువు పోరాటం
రావణుడు సీతను అపహరించి రథం మీద కూర్చోపెట్టుకుని వినువీధులలో దూసుకెళ్తున్నాడు. సీతమ్మ భయ విహ్వల అయి తన భర్తను తలుచుకుంటూ రావణుని నిందిస్తుంది. ఈ దృశ్యం అల్లంతదూరాన చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్న జటాయువు దృష్టిలో పడింది. సరిగ్గా అదే సమయంలో సీతమ్మ కూడా జటాయువును చూసింది. రెండు చేతులు జోడించి "ఆర్యా! ప్రణామాలు! నన్ను ఈ దుష్ట రావణుడు అపహరించుకొని పోతున్నాడు. మీరు వెంటనే ఈ విషయాన్ని రామలక్ష్మణులకు తెలియజేయండి. వారే వీడి పీచమణుస్తారు" అంటూ అభ్యర్థించింది. జరుగుతున్న ఈ ఘోరాన్ని చూసి జటాయువు చలించిపోయాడు. ఆగ్రహావేశాలతో రావణుడి రథాన్ని వెంబడిస్తూ "ఓరి దుష్ట రాక్షసా! పిరికిపందలా...! రామలక్ష్మణులు లేని సమయాన సీతను అపహరించుకు వెళుతున్నావా! సిగ్గు లేదా! నీకు చావు దగ్గర పడింది. స్వీయ వినాశనం కోసమే నీలాంటి అధర్మ కార్యాలకు ఒడిగడతారని నిన్ను చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మర్యాదగా సీతమ్మను తీసుకెళ్లి, సగౌరవంగా రామునికి అప్పగించి శరణు వేడు నిన్ను క్షమించి వదులుతాడు అని అన్నాడు.  
రావణుడు ఆ మాటలను వినిపించుకోకుండా ముందుకు వెళుతున్నాడు. ఇలా లాభం లేదనుకొని జటాయువు తన బలమైన  కాళ్లతో రావణుడిని పొడిచాడు, ధనుస్సుని విరిచి పారేశాడు.దాంతో భగ్గుమన్న రావణుడు జటాయువు మీదికి ఎన్నో అస్త్రశస్త్రాలను ప్రయోగించాడు. వాటినన్నింటిని తన రెక్కలతో ఆవలికి విసిరి కొడుతూనే సువర్ణ సదృశ్యమైన తన వాడి గోళ్ళతో రావణుని పొడిచి చికాకు పెట్టసాగాడు. ఇది సామాన్యమైన పక్షి కాదని గ్రహించిన రావణుడు మహిమాన్వితమైన తన ఖడ్గంతో జటాయువు రెక్కలను ఖండించి వేసాడు.
 
దాంతో ఆ వృద్ధ పక్షిరాజు మొదలు నరికిన చెట్టులా నేలకూలింది. అది చూసిన రావణుడు రెట్టించిన వేగంతో లంకవైపు దూసుకుపోయాడు.
 
అవతలి వాడు అమిత బలశాలి అని ఆ పక్షికి తెలుసు. అయినప్పటికీ అతనిని నిలువరించేందుకు తన ప్రయత్నం తాను చేసి ఈ వార్తను రామలక్ష్మణులకు చేరవేసేందుకు ప్రాణాలు వేచిచూసింది. చివరికి రాముడికి వర్తమానం అందించింది జటాయువు.
 
నీతి ఏమిటంటే చెడును అడ్డుకోవడానికి చివరి వరకు పోరాటం చేయాల్సిందే! అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధం కావాల్సిందే!.

No comments:

Powered by Blogger.