కృష్ణుడి శిరోవేదన
అది ద్వారకలోని శ్రీకృష్ణ మందిరం. రుక్మిణీ సత్యభామలు ఎందుకో
తీవ్రమైన ఆందోళనతో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో నారదులవారు శ్రీకృష్ణ భగవానుడిని
చూడటానికి వచ్చారు. రుక్మిణీ సత్యభామలు లేచి ఏడుస్తూ వెళ్లి, ఆయన పాదాల ముందు
ప్రణమిల్లారు. లేవండి! అమ్మ లేవండి! ఎందుకిలా ఉన్నారు? చెప్పండి! మీకేం భయం లేదు
నేను ఉన్నానుగా" అంటూ అనునయంగా అడిగాడు. ఏం చెప్పమంటారు స్వామి! మా నాధుడు
భరించలేనంత శిరోవేదన తో బాధపడుతున్నారు. దయచేసి తరుణోపాయం సెలవివ్వండి అన్నారు.
నారాయణ! నారాయణ! అది మామూలు తలనొప్పి కాదు, బహుశా శత్రువులెవరో చేయించిన ప్రయోగం
అయివుంటుంది. నిజమైన భక్తులు ఎవరైనా తమ పాద ధూళి నుంచి మంచి నీటితో కలిపి ఆయనతో
తాగిస్తే సరి"! అన్నాడు నారదుడు. నారదుడు చెప్పిన మాటలు వింటూనే రుక్మిణీ సత్యభామలు
"రామ! రామ! జగాలనేలే ఆ స్వామికి మా పాదధూళి కలిపిన నీటిని ఇస్తే సర్వపాపాలు
మమ్మల్ని చుట్టూ కోవూ"? అంటూ గట్టిగా చెవులు మూసుకున్నారు. కృష్ణుడు
మూలుగుతూనే "పోనీ రేపల్లెకు వెళ్లి గోపికలకు విషయం తెలియజెప్పి రండి"
అంటూ మూలుగులు అధికం చేశాడు. నారదుడు వెంటనే రేపల్లె వెళ్లాడు. ఆయన్ని చూస్తూనే
గోపికలందరూ "స్వామి! మా కృష్ణయ్య కుశలమేనా! అంటూ అడిగారు. నారదుడు విచారంగా
ముఖంపెట్టి "ఏం చెప్పమంటారు అమ్మా! కృష్ణుడు అమితమైన తలనొప్పితో బాధపడుతూన్నాడు.
అది తగ్గాలంటే ఎవరైనా భక్తులు తమ పాదధూళిని మంచి నీటిలో కలిపి దానిని కృష్ణుడి చేత
తాగించాలి" అని చెప్పాడు. ఆ మాటలు వినగానే ఒక గోపిక తన పాదధూళిని
ఒక వస్త్రంలో ఉంచింది. తక్కిన గోపికలు అందరు తమ పాదధూళిని అక్కడ వేశారు.నారదుడు
గోపికల పాదధూళిని మూటగట్టుకున్నాడు.
నారదుడు "దీనితో కృష్ణుడి శిరోవేదన తగ్గిపోతుంది, కానీ మీరందరికీ రౌరవాది నరక
బాధలు తప్పవు మరి" అన్నాడు నారదుడు. "మా కన్నయ్య తల నొప్పి తగ్గితే
మాకది చాలు స్వామి!" అన్నారు అందరూ ముక్తకంఠంతో. మెచ్చుకోలుగా వారి వైపు చూస్తూ నారదుడు
ఆకాశమార్గాన వెళ్ళి జరిగిందంతా చెబుతూ కృష్ణుడి ముందు ఆ మూటను ఉంచాడు.
No comments: