పాప ప్రక్షాళనం
ఒకసారి శివపార్వతులు ఆకాశమార్గంలో
కాశీనగరానికి వెళుతున్నారు. వారికి గంగానదిలో అనేకమంది యాత్రికులు స్నానం
చేస్తుండటం కనిపించింది. అది చూసి పార్వతి "నాధా! ఇంతమంది గంగలో స్నానం
చేస్తున్నారు కదా! నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా? అదే నిజమైతే అందరూ పాపాలు
చేసి వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగాస్నానం చేసి, పాపాలు పోగొట్టుకుంటారు కదా"!
అని సందేహం వెలిబుచ్చింది. శివుడు చిరునవ్వుతో "దేవి! ఇప్పుడు నేను ఒక విధానం
చెబుతాను నీవు ఆ విధంగా చేయి! అప్పుడు నీ
ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది" అంటూ ఆమె ఏమి చేయాలో చెప్పాడు. ఆ ప్రకారం
పార్వతి పండు ముత్తయిదు రూపం ధరించి గంగలో మునిగి పోతున్న ఒక వృద్ధుని చూపిస్తూ
దయచేసి "నా భర్తను కాపాడండి"! అంటూ కేకలు వేయసాగింది. ఆ మాటలు విని చాలా
మంది గంగలోకి దూకి! ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు సిద్ధమయ్యారు. అది చూసిన
వృద్ధురాలు "అయ్యా నా భర్తకు ఒక శాపం ఉంది. పాపాత్ములెవరు ఆయనను ముట్టుకుంటే
వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి, అదేవిధంగా ఆయనకి తాకిన వారి తల బద్దలవుతుంది, కనుక
మీలో పాపరహితుడైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి" అని
హెచ్చరించింది. ఆ మాటలు విని అందరూ వెనక్కి వెళ్లిపోయారు. ఒకే ఒక వ్యక్తి మాత్రం
నదిలోకి దూకి కొట్టుకుపోతున్న వృద్ధుడిని పుచ్చుకొని తనమీద ఆయనను మోస్తూ, ఒడ్డుకు
తీసుకు వచ్చాడు. వృద్దురాలు అతనికి కృతజ్ఞతలు చెబుతూ "నాయనా! నీవు ప్రాణాలకు
తెగించి మరీ నా మాంగల్యం దక్కించావు! నీవు పాప రహితుడివా!.. అని అడిగింది. ఆ
వ్యక్తి "అమ్మా! నేను ఇంతకుముందే గంగాస్నానం చేసి పునీతుడిని అయ్యాను. అందుకే
నీ పతి ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నించాన"ని! చెప్పాడు. పార్వతీ
పరమేశ్వరులు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి అంతులేని సంపదను ప్రసాదించి తిరిగి వినువీధుల్లో
విహరించసాగారు! "చూశావా! దేవి విశ్వాసం ఉంటే గంగ తప్పకుండా వారి పాపాలను
ప్రక్షాళన చేస్తుంది" అన్నాడు పరమేశ్వరుడు. అర్ధమైనట్లు గా పార్వతి
చిరునవ్వుతో తల పంకించింది. నీతి: "పనిచేస్తుందా, లేదా! అని అనుమానం తో
వేసుకుంటే ఔషధం కూడా పనిచేయదు. దృఢ విశ్వాసంతో చేసే పని తప్పక ఫలితాన్నిస్తుంది
అన్నది ఇందులోని నీతి.
No comments: