హృదయ పరివర్తనం |


హృదయ పరివర్తనం


కురుక్షేత్ర సంగ్రామ ముగిసిన తర్వాత ధర్మరాజు హస్తినకు రాజయ్యాడు. ధర్మబద్ధంగా పాలన చేస్తూ ప్రజల మన్నలను అందుకో సాగాడు. కొన్నాళ్ళకు ధర్మరాజు తీర్థయాత్ర చేయాలనుకున్నాడు. సోదరులకు, సామంతరాజులకు తన మనోభీష్టాన్ని తెలిపాడు. వారిలో కొందరు ధర్మరాజుతో కలిసి యాత్ర చేయాలని నిశ్చయించుకున్నారు. అదే సమయంలో ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్లి "కృష్ణా! నేను, మరికొంతమంది తీర్థయాత్రలకు వెళుతున్నాము. నువ్వు కూడా మాతో వస్తే అంతకన్నా భాగ్యం మరొకటి ఉండదు" అన్నాడు. "యాత్రలు చేసే సమయం తనకు లేదు" అన్నాడు కృష్ణుడు. ధర్మరాజు పట్టు వీడలేదు. అప్పుడు కృష్ణుడు ధర్మరాజుకు ఒక సొరకాయను ఇచ్చి "ధర్మరాజా! పనుల వత్తిడి వల్ల నీతో పాటు యాత్రకు రాలేక పోతున్నాను. నా ప్రతినిధిగా ఈ సొరకాయను మీ వెంబడి తీసుకువెళ్ళు" అని చెప్పాడు. కృష్ణుడి ఆదేశం ప్రకారం ధర్మరాజు సొరకాయను నెత్తిన పెట్టుకుని యాత్రకు వెళ్ళాడు. 

మూడు నెలలు తరువాత యాత్రలన్నీ పూర్తిచేసుకుని తిరిగి హస్తినకు చేరుకున్నాడు. మర్నాడు అన్న సమారాధన చేయాలని భావించాడు ధర్మరాజు. శ్రీ కృష్ణుడి దగ్గరకు వెళ్లి "కృష్ణా! మా యాత్ర విజయవంతంగా పూర్తయింది. నీవు ఇచ్చిన సొరకాయను నేను మునిగిన అన్ని తీర్ధాలలో ముంచాను, రేపు అన్నసమారాధన ఉంది. నీవు తప్పకుండా రావాల"ని కోరాడు. అప్పుడు కృష్ణుడు "ధర్మరాజా! అన్నసమారాధన లో ఈ సొరకాయ వండి అందరికీ ప్రసాదం పంచండి" అన్నాడు. అలాగే చేశాడు ధర్మరాజు. సొరకాయ తో వండిన పదార్ధాలన్నీ తిన్న వారంతా చేదు భరించలేక వాంతులు చేసుకున్నారు. అందరు "ధర్మరాజా! చేదు సొరకాయలతో ఎందుకు వంట చేశారు" అని ప్రశ్నించారు. కలత చెందిన ధర్మరాజు ఆరాధనకు వచ్చిన కృష్ణుడితో "కృష్ణా...! అందులో మీరిచ్చిన సొరకాయ ఉన్నది" అన్నాడు. కృష్ణుడు నవ్వి "ధర్మరాజా! ఆ సొరకాయ చేదుగా ఉందని నాకు ముందుగానే తెలుసు! నీతో పాటు ఎన్నో తీర్ధాలను మునక వేసింది కదా..! దాని చేదు పోయిందేమో...! అనుకున్నాను, ఇంకా అలాగే ఉన్నట్టు ఉంది"! అన్నాడు. ధర్మరాజుకు విషయం అర్థమై కృష్ణుడికి దండ ప్రణామాలు చేశాడు. వేలమంది నిత్యం తీర్థయాత్రలు, జపతపాలు చేస్తున్నారు కానీ! మనసులో గూడు కట్టుకుని ఉన్న అసుర గుణాలు, పాప సంస్కారాల గురించి చింతించడం లేదు. "హృదయ పరివర్తన" లేని యాత్రలు ఎన్ని చేసినా! తీర్థాలలో ఎన్నిసార్లు మునిగినా..! ఫలితం ఉండదు. అన్నది ఈ కథలోని నీతి....

No comments:

Powered by Blogger.